ఆధ్యాత్మిక విషయాలను వ్యక్తిగతంగా చదివితే కొన్ని సందేహాలు రావచ్చును. వాటిని నివృత్తి చేసుకోవడానికి మరొక గురువును ఆశ్రయించాలి. పదిమంది చేరి వేదాంతవిషయాలను అధ్యయనం (పరిశీలన, చర్చించడం ) చేస్తేఒకరి సందేహాలను మరొకరు అప్పటికప్పుడు నివృత్తి చేసుకోవచ్చు.
అధ్యయనమండలిని సమితి సభ్యులవయోపరిమితిని అనుసరించి ఏర్పాటు చేయడమువలన ఒకే ఆలోచనావిధానము, భావ సారూప్యం కలుగుతుంది. బాల వికాస్ పిల్లలు, గురువులు, మహిళా సభ్యులు, సీనియర్ సభ్యులు, నూతన సభ్యులు బృందాలుగా ఏర్పడి ఆధ్యాత్మిక విషయాలను పరస్పరం చర్చించాలి. అందరూ వలయాకారంగా ఆసీనులైతే ఒకరి ముఖకవళికలు, హావభావాలు అందరికీ అర్ధమౌతాయి. ఒక సభ్యుడు నేతృత్వము వహించి ప్రారంభము, చర్చ, ముగింపు వంటి వాటిలో బృందంలోని సభ్యులందరూ పాల్గొనే విధంగా ప్రోత్సహించాలి.జఠిలమైన విషయాలు, వేదాగోష్ఠులు, సిద్దంతాలపై రాద్ధాంతాలు, అప్రస్తుత ప్రసంగాలు చర్చించరాదు.
స్వామి బాల్యం, స్వామి సందేశాలు, స్వామి మధుర భాషణాలు, దివ్య సంబాషణాలు, అనుభవాలు, లీలా వైభవాలు చర్చించవచ్చును.
రామకథారసవాహిని, భాగవతావాహిని, గీతావాహిని,సంస్థయొక్క లక్ష్యములు, ప్రయోజనములు, సాయి సాహిత్యం, వివిధ వాహినులు చర్చించవచ్చును.
సమత్వం, సమానత్వం, ఆనందంతో శరణాగతి , పరిపూర్ణవిశ్వాసం, భక్తిసూత్రాలు, భజన మార్గదర్శకాలు, మొదలగు సూత్రములు బహుళప్రయోజనాలు కల్గిస్తాయి.
వారమునకు ఒకమారు ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ కు కేటాయించవచ్చును. దీనికి భజన పద్ధతి పాటించనవసరం లేదు. ఓంకారంతో ప్రారంభించి శాంతిమంత్రముతో ముగించదగును.
ప్రతినెలా వెలువడు సనాతన సారధిలోని విషయాలను కనీసము నెలలో ఒక వారపు క్లాసునందైనా చర్చించడం మంచిది.