సత్సంగత్వే నిస్సంగత్వం – నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మొహత్వే నిశ్చలతత్వం – నిశ్చలతత్వే జీవన్ముక్తి
సత్సంగముద్వారా విషయవాంఛలలో విరక్తి భావన కలుగుతుంది. వైరాగ్యభావనలో నేను, నాది అనే స్వార్ధాలు లేక నిర్మొహత్వం కలిగి దానివలన మనసు చంచలం నుండి స్థిరత్వం కలుగుతూ అది జీవన్ముక్తికి మార్గమౌతుంది.
సత్సంగం అనగానే ఉపన్యాసం అనుకోవడం సరియైనది కాదు. సత్ + సంగం సంగం అనగా కూడిక. సత్ ను కూడి ఉండటమే సత్సంగం. సత్ అనగా శాశ్వతం సత్యస్వరూపమే సత్ అనే భగవంతుని ప్రతిరూపం. మనలను సత్ చింతనతో, సద్భక్తితో, సద్భుద్ధితో భగవంతుని సామీప్యం కల్గించేదే సత్సంగం.
భగవంతుని నుండి వేరుచేయునది దుస్సంగము. దానివలన అశాంతి, పునరపి జననం, పునరపి మరణం ప్రాప్తిస్తాయి. సత్సంగము దివ్యత్వానికి సరియైనమార్గం. సత్సంగంలో చెరీ భక్తులతోభాగవన్నామము, శ్రవణము చేయగలిగితే కాలము, కాయము పవిత్రమౌతాయి.
కాలక్షేపం గాని, అనవసర విషయాలపై వ్యర్ధ ప్రసంగాలు, చాడీలు చెప్పడం, పరదూషణ దుస్సంగాలు. పుణ్యశ్రవణకీర్తన, భగవత్ లీలా వైభవాలపై ఆసక్తి, భాగవత కథాశ్రవణం, భజన వేదాంత విషయ పరిజ్ఞానం సత్సంగానికి మూలాలు.
సత్సంగము వలన కలుగు లాభాలు
మనలోని శక్తి చైతన్యవంతం అవడం
వేదాంత విషయాలలో పరిపూర్ణ జ్ఞానం
భక్తిగలిగి అభివృద్ధిగావించడం
సత్సంగముతో మానవతా విలువలతో కూడిన జీవన విధానం
మృదుభాషణ, ప్రేమతో జీవనం
కాలాన్ని ప్రయోజనకరంగా మార్చుకొని తరించడం
ఆత్మాసాక్షాత్కారం కలగడం
చిత్తవీక్షేపం, చిత్తచాంచల్యం అరికట్టబడటం
జగత్ మిధ్య అని గుర్తించడం.
మోక్షప్రాప్తికి మానవజీవితాన్ని పనిముట్టుగా ఉపయోగించడం